Dubai Floods: క్లౌడ్ సీడింగ్ కాకుంటే.. మరి దుబాయ్ వరదలకు కారణమేంటి..?

  • ఆరు విమానాలతో క్లౌడ్ సీడింగ్ చేశారంటూ ప్రచారం
  • ఓవైపు ఉరుములు మెరుపులు ఉంటే క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తామన్న దుబాయ్
  • నేషనల్ సెంటర్ ఫర్ మెటరాలజీ డిప్యూటీ డీజీ వివరణ
If Not Cloud Seeding What Exactly Caused Historic Dubai Flooding

వర్షపు చుక్క కనిపించడమే అరుదైన ఎడారి ప్రాంతం దుబాయ్ లో కుండపోతగా వర్షం కురవడం.. రోడ్లు, కాలనీలు నదులను తలపించేలా మారడం వెనక కారణమేంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది. క్లౌడ్ సీడింగ్ పేరుతో ప్రకృతితో చెలగాటం ఆడడం వల్లే దుబాయ్ వాసులకు ఈ కష్టం వచ్చిందని నిపుణులు చెబుతుండగా.. సాధారణ రోజుల్లో క్లౌడ్ సీడింగ్ చేయడం నిజమే కానీ ఈ వరదలకు క్లౌడ్ సీడింగ్ కు సంబంధం లేదని యునైటెడ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం స్పష్టం చేసింది. 

మేఘాలు ఏర్పడిన తొలిదశలోనే క్లౌడ్ సీడింగ్ సాధ్యమని, ఓవైపు ఉరుములు, మెరుపుల వాతావరణంలో క్లౌడ్ సీడింగ్ ఎలా చేస్తామంటూ ప్రశ్నిస్తోంది. ఈమేరకు యూఏఈలోని నేషనల్ సెంటర్ ఫర్ మెటరాలజీ (ఎన్సీఎం) డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అల్ యాజీది ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. దుబాయ్ లో ప్రస్తుత వరదలకు క్లౌడ్ సీడింగ్ కారణం కాదని, మంగళవారం క్లౌడ్ సీడింగ్ ఆపరేషన్ నిర్వహించలేదని స్పష్టం చేశారు.

మరి వరదలకు కారణమేంటి..
ఏడాదిన్నరలో కురిసే వర్షం ఒక్క రోజులోనే దుబాయ్ ను ముంచెత్తడానికి కారణం ఏంటనేది ప్రస్తుతం మిస్టరీగా మారింది. ఎడారి ప్రాంతం కావడంతో దుబాయ్ లో వర్షాన్ని కృత్రిమంగా కురిపిస్తారు. పక్కనే ఉన్న సముద్రంలో నీటి ఆవిరి కారణంగా ఆకాశంలో ఏర్పడే మేఘాలపైకి విమనాలను పంపి క్లౌడ్ సీడింగ్ చేస్తారు. దీంతో తరచూ దుబాయ్ లో వర్షం కురుస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు కూడా ఇలా కృత్రిమంగా వర్షం కురిపించి వాతావరణం చల్లబడేలా చేస్తున్నారు. ఈ నెల 16 (మంగళవారం)న కూడా అధికారులు క్లౌడ్ సీడింగ్ చేశారని, ఆరు, ఏడు విమానాలను మేఘాల్లోకి పంపించారని ప్రచారం జరుగుతోంది.

దీంతో దుబాయ్ ని కుండపోత వర్షం ముంచెత్తిందని వాతావరణ నిపుణులు ఆరోపించారు. ఈ ప్రచారంపై ఎన్సీఎం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ స్పందిస్తూ.. అయితే, తాజాగా కురిసిన భారీ వర్షానికి కారణం క్లౌడ్ సీడింగ్ కాదని తేల్చిచెప్పారు. దీంతో క్లౌడ్ సీడింగ్ కాకుంటే దుబాయ్ లో కుండపోత వర్షానికి ఒకే ఒక అవకాశం ఉందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. వాతావరణ మార్పుల కారణంగా అరేబియా పెనిన్సులా మీదుగా గల్ఫ్ ఆఫ్ ఒమన్ పై ఏర్పడిన భారీ తుపాను వల్లే దుబాయ్ ని వర్షం ముంచెత్తి ఉంటుందని వివరించారు.

More Telugu News